ఏలూరు, ఫిబ్రవరి, 22: జీవనోపాధి కోసం విద్యుత్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తూ తీవ్ర గాయాలకు గురైన జనసైనికుడు ఆడారి రాముకు గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు ఆపన్నహస్తం అందించారు. ప్రమాదంలో రెండు చేతులు కాలిపోవడంతో చికిత్స అనంతరం ప్రస్తుతం ఇంటికే పరిమితమైన రాము తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
చిన్ననాటి నుంచే తల్లిదండ్రులను కోల్పోయిన రాము, వృద్ధులైన అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ వారికి ఆధారంగా ఉన్నాడు. ప్రస్తుతం పనిచేయలేని స్థితిలో ఉండడంతో కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు స్పందించి మూడు నెలలకు సరిపడా పచారి సరుకులు మరియు కొంత నగదు సహాయం అందజేశారు.
ఈ సహాయాన్ని గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ ప్రతినిధులు షేక్ మీరావల్లి, అడపా శ్రీను, తమ్మిశెట్టి కాశి విశ్వేశ్వరరావు, కేశవరపు శివ ఏలూరుకు విచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి డా. ఘంటసాల వెంకటలక్ష్మి చేతుల మీదుగా రాముకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు వీరంకి పండు, జనసేన నాయకులు సోషల్ సర్వీస్ మురళి, బోండా రాము నాయుడు, కోలా శివ, చిత్తిరి శివ, దెందులూరు నియోజకవర్గం మరియు ఏలూరు రూరల్ మండల జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యుడు మల్లుల పాండురంగ తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, ఆయన స్ఫూర్తితో గల్ఫ్ దేశాల్లో కష్టపడి సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని అవసరమైన పేదవారికి సహాయం చేయడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ సభ్యుల సేవాభావాన్ని జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేకంగా అభినందించారు.







