విజయవాడ, ఫిబ్రవరి, 22: భారతీయ విలువిద్య క్రీడకు ఉన్న పురాతన చరిత్రను ప్రతి ఆర్చర్ అవగాహన చేసుకోవడం ద్వారా తమ క్రీడా పటిమను మరింత మెరుగుపరుచుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. నగరం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు వెలువడేలా జిల్లా కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ఎన్టీఆర్ & కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ఎన్టీపీసీ ఖేలో ఇండియా నేషనల్ ర్యాంకింగ్ (మహిళలు – సీనియర్, జూనియర్, సబ్ జూనియర్) ఆర్చరీ టోర్నమెంట్‌ను ఆదివారం విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణంలో తొలి బాణం సంధించి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జెండాను టోర్నమెంట్ కాంపిటేషన్ డైరెక్టర్ అరుందతి సిలో ఆవిష్కరించగా, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ జెండాను ఒలింపియన్ తండ్రి బొమ్మదేవర శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు.
అతి పురాతన చరిత్ర కలిగిన అమరావతి ప్రాంతమైన విజయవాడకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన జాతీయ, అంతర్జాతీయ ఆర్చర్లకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరచి మీ ప్రాంతాలకు విజయాలను అందించాలని ఆకాంక్షించారు. ఆర్చరీ అభివృద్ధికి జిల్లాల తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వందలాది మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు శారీరక దృఢత్వం కూడా వస్తుందని చెప్పారు. ప్రతి క్రీడకు ప్రత్యేకత ఉన్నట్లే విలువిద్యకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణ, కోశాధికారి చెరుకూరి కృష్ణకుమారి, కృష్ణా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







