ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ: ఏ.కొండూరు మండలం చీమలపాడు సచివాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి నెలకు నిర్ణయించిన అంశం ‘జీరో లిట్టర్ గవర్నెన్స్’ను అమలు చేసే దిశగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ పరిపాలనను బలోపేతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జి. లక్ష్మీశ సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి “ప్లాస్టిక్ వాడకం నిషిద్ధం” అనే నినాదాలతో గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామ హరిత రాయబారులను సత్కరించి వారికి బియ్యం, నిత్యావసర సరుకులు బహుకరించారు.
జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి పి. లావణ్య కుమారి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పేపర్ లేదా గుడ్డ సంచులను ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, తడి చెత్తతో వానపాము ఎరువు తయారు చేసి రైతులకు విక్రయిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛ రథం ద్వారా గ్రామాల్లో సేకరించి, ఆ విలువకు సమానమైన కిరాణా సరుకులు అందజేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం. నాగలక్ష్మి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీమతి వెంకట రమణ, మండల పరిషత్ అధికారులు బొజ్జగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం కీలకమని అధికారులు పేర్కొన్నారు.







