తాజా వార్తలు

10/recent/ticker-posts

సాహో… సేంద్రియ సాగు!


 

గేమ్ ఛేంజర్‌గా ప్ర‌కృతి వ్యవసాయం – విజయవంతంగా ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం

ఎన్‌టీఆర్ జిల్లా: రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్ర‌కృతి సాగును మహోద్యమంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఎన్‌టీఆర్ జిల్లాలో సరికొత్త మైలురాయి నమోదు అయింది. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో శనివారం నిర్వహించిన “ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం” ఘనవిజయాన్ని సాధించింది. రైతులు, వినియోగదారులు, మార్కెటింగ్ సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్ర‌కృతి వ్యవసాయ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ మహాసదస్సు జిల్లా సేంద్రియ సాగుకు నూతన దిశను చూపింది.

ఈ కార్యక్రమాన్ని ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సేంద్రియ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్, బీఆర్‌సీ-మార్కెటింగ్, కార్బన్ క్రెడిట్స్ & ట్రేసబులిటీ, రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్ట్ తదితర స్టాళ్లు ఏర్పాటు చేశారు. దేశవాళీ వంగడాలు, జీవామృతం, గో ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయ డ్రోన్లు ఆకట్టుకున్నాయి. ప్ర‌కృతి సేద్యాన్ని ఆదర్శంగా అమలు చేస్తున్న ఏడు మంది రైతులను సత్కరించారు.


లక్ష ఎకరాల లక్ష్యం – కార్యాచరణ ప్రారంభం

రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ మాట్లాడుతూ సేంద్రియ సాగు వల్ల భూమికి, రైతుకు, సమాజానికి బహుళ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. పెరిగిన సాగు ఖర్చులు, ఆదాయ అస్థిరత, ప్రజారోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం ప్ర‌కృతి సాగేనన్నారు. ప్రపంచ మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 42 వేల మంది రైతులు సుమారు 50 వేల ఎకరాల్లో ప్ర‌కృతి సాగు చేస్తున్నారు. తొలి విడతలో లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా చర్యలు ప్రారంభించామని తెలిపారు. గ్రామాల వారీగా క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ లింకేజీలు, సాంకేతిక మద్దతు సమగ్రంగా అమలు చేస్తామని చెప్పారు.


ట్రేసబులిటీ – విత్తు నుంచి విక్రయం వరకు పారదర్శకత

సీఎం దార్శనికతకు అనుగుణంగా ట్రేసబులిటీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విత్తు ఎంపిక నుంచి పంట కోత, నిల్వ, రవాణా, విక్రయం వరకు ప్రతి దశలో సమాచారాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారులు పంట ఎక్కడ పండింది? ఏ సర్వే నంబరులో సాగు చేశారు? ఏ సేంద్రియ ఎరువులు వాడారు? వంటి వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో నమ్మకం పెరిగి రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు.


ప్రతి రైతూ బ్రాండ్ అంబాసిడర్ – ప్రతి గ్రామం క్లస్టర్

ప్ర‌కృతి వ్యవసాయ విస్తరణలో ప్రతి రైతును ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రతి గ్రామాన్ని ఒక క్లస్టర్‌గా తీర్చిదిద్దే ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేల సారాన్ని పునరుద్ధరించడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, రైతు ఖర్చులు తగ్గించి లాభాలు పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు. వినియోగదారులకు ఆరోగ్యకర ఆహారం అందించడం ద్వారా సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే దీని పరమావధి అన్నారు.


కార్బన్ క్రెడిట్లు – అదనపు ఆదాయానికి మార్గం

సేంద్రియ వ్యవసాయం గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహకరిస్తుంది. నేలలో కార్బన్ నిల్వ పెరిగినప్పుడు కార్బన్ క్రెడిట్లు ఉత్పత్తి అవుతాయి. వాటిని కంపెనీలు కొనుగోలు చేస్తాయి. దీంతో రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. సంప్రదాయ పంటల ఆదాయానికి తోడుగా ఇది సరికొత్త ఆదాయ వనరుగా మారనుంది.


మార్కెటింగ్ & విలువ ఆధారిత ఉత్పత్తులు

సేంద్రియ పంటలకు ప్రత్యేక మార్కెట్లు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఆన్‌లైన్ విక్రయ వ్యవస్థల అభివృద్ధిపై చర్చలు జరిగాయి. స్థానికంగా ఉత్పత్తి చేసిన సేంద్రియ ధాన్యాలు, కూరగాయలు, పప్పులు, నూనెలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మార్కెట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రైతుల ఆర్థిక స్థిరత్వం – పర్యావరణ పరిరక్షణ – వినియోగదారుల ఆరోగ్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ఎన్‌టీఆర్ జిల్లా సేంద్రియ సాగులో ఆదర్శంగా నిలవాలని అధికారులు ఆకాంక్షించారు.

ప్ర‌కృతి వ్యవసాయం మన సంస్కృతి… సమష్టిగా దీన్ని కాపాడుకుందాం!