- ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో నిర్వహణ
- అన్నదాతలు, ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోండి
- మార్కెట్ లింకేజీలపై ప్రత్యేక అవగాహన సదస్సులు
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ: ఈ నెల 22వ తేదీ ఆదివారం విజయవాడ, ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఎన్‌టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం (సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, సేంద్రియ వ్యవసాయ రైతులు, వినియోగదారుల అవగాహన సదస్సు) జరగనుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం తెలిపారు. అన్నదాతలు, ప్రకృతి వ్యవసాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సేంద్రియ వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రైతులకు సామర్థ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ స్టాళ్లు కూడా ఉంటాయని, సేంద్రియ సాగుకు అవసరమైన ఉత్పాదితాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రధానంగా మార్కెట్ లింకేజీలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ట్రేసబులిటీపైనా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులు ఆ ఉత్పత్తికి సంబంధించి విత్తు వేసిన దగ్గరి నుంచి విక్రయించే వరకు ప్రతి విషయాన్ని తెలుసుకునేలా ట్రేసబులిటీ విధానం, మార్కెట్ సదుపాయాలపై అవగాహన కల్పించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.







