తాజా వార్తలు

10/recent/ticker-posts

బలివే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష


ఏలూరు/ముసునూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: ముసునూరు మండలం బలివే గ్రామంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం బలివే ఆలయాన్ని సందర్శించారు.


ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పాలకవర్గం, కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మంత్రి అంతరాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి, దుశ్శాలువాతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఉత్సవాల నిర్వహణలో సమన్వయంతో పని చేసి, భద్రత, పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాదు, ఆలయ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.