జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి జి. సత్యనారాయణ హెచ్చరిక
ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరుకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి జి. సత్యనారాయణ హెచ్చరించారు.
జిల్లా పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకాల కింద గృహ నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించబడిందన్నారు. పీఎంఏవై (గ్రామీణ్) కింద 54,234 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని, పీఎంఏవై (అర్బన్) కింద 2,750 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారని తెలిపారు.
అర్బన్ విభాగంలో నమోదు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 1,191 మందికి గృహాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులు, స్వంత స్థలం కలిగి గృహ మంజూరుకు అర్హత ఉన్న వారు హౌసింగ్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, పథక నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గృహ మంజూరు కోసం ఎవరికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వెంటనే 7093930105 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా గృహనిర్మాణ శాఖాధికారి జి. సత్యనారాయణ తెలిపారు.







