చాట్రాయి, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ మండల కేంద్రంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ రహదారులపై ట్రాక్టర్లను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్సై పేర్కొన్నారు.
డ్రైవర్లు జాగ్రత్తగా, నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ప్రతి ట్రాక్టర్‌కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రికార్డులు సరిగా లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వయస్సు నిండని పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్లు ఇవ్వకూడదని యజమానులకు సూచించారు.
మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే యజమానులపై కఠిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీలలో పరిమితికి మించి లోడ్ వేయకూడదని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వెనుక వైపు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల రహిత మండలంగా మార్చడానికి సహకరించాలని ఎస్సై రామకృష్ణ కోరారు.







