తాజా వార్తలు

10/recent/ticker-posts

చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా భగ్నం: నలుగురు అరెస్ట్ – వాహనం సీజ్


నూజివీడు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పెదపాడు పోలీసులు పట్టుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, పెదవేగి ఇన్స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ కు అందిన సమాచారం మేరకు 12-02-2026 సాయంత్రం తోటగూడెం గ్రామ శివారులో తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అనుమానాస్పదంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని ఆపి పరిశీలించగా, సరైన అనుమతులు లేకుండా మరియు శుభ్రత నిబంధనలు పాటించకుండా వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, సంబంధిత నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. చికెన్ వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయడం లేదా అక్రమంగా తరలించడం వల్ల తీవ్ర దుర్వాసనతో పాటు వాయు కాలుష్యం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. 

ఈగలు, దోమలు పెరగడం ద్వారా కాలరా, టైఫాయిడ్, డయేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా భూగర్భ జలాలు కలుషితం కావడం, చర్మ సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధమే కాకుండా సమాజానికి హానికరమని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 112 కు లేదా పెదపాడు ఎస్ఐ ఫోన్ నెంబర్ 9440796637 కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం మనందరి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు.