ఏలూరు, ఫిబ్రవరి 13: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏలూరు పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమాలయం సెంటర్ వద్ద ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1-టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ వై. సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు చలానాలు విధించడం జరుగుతుంది. అయితే, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మానవతా దృక్పథంతో జరిమానా కంటే భద్రత ముఖ్యమని భావించి, అవగాహన ద్వారా మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. తనిఖీల్లో హెల్మెట్ లేకుండా పట్టుబడిన సుమారు 30 మంది ద్విచక్ర వాహనదారులతో అక్కడికక్కడే నాణ్యమైన హెల్మెట్లను కొనుగోలు చేయించి, వారందరికీ ధరింపజేశారు.
భద్రంగా ప్రయాణించాలంటూ సూచనలు చేశారు. పోలీసులు ప్రజలకు “చలానా కట్టడం కంటే ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం” అనే సందేశాన్ని తెలియజేశారు.







