ఏలూరు/ముసునూరు, ఫిబ్రవరి 13: ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా కేటాయించిన పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.
🕉️ మంత్రి సూచనలు
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు.
-
శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు సమన్వయంతో నిర్వహించాలన్నారు.
-
క్యూలైన్ వ్యవస్థను సక్రమంగా అమలు చేసి గర్భిణీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించాలన్నారు.
-
అక్రమ మద్యం, మత్తు పదార్థాలు, జేబుదొంగలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
-
తాత్కాలిక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
-
తమ్మిలేరు కాలవల వద్ద లోతైన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, గజతగాళ్లు, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
📋 కలెక్టర్ ఆదేశాలు
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పట్టిసీమ, బలివే ప్రాంతాల్లో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
-
రహదారుల్లో రాకపోకలకు అంతరాయం లేకుండా బారికేడ్లు, ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
-
సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా భద్రతా పర్యవేక్షణ నిర్వహించాలన్నారు.
-
గోదావరి ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
త్రాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలు, చలువ పందిళ్లు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
-
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడపాలని సూచించారు.
-
జెట్టీలు, బోట్లు, జెయింట్ వీల్ తదితరాలకు సంబంధిత శాఖల ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి, కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఎస్పీ కె.వి.వి.యన్.వి. ప్రసాదు, ఆలయ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య, వివిధ శాఖల అధికారులు, పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.







