విద్యార్ధిని తోటలోకి తీసుకెళ్లి దాడి చేసిన మూక
గుంటూరు/చేబ్రోలు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: వడ్లమూడిలోని విజ్ఞాన్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఒక విద్యార్థిపై తోటి విద్యార్థులే మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత విద్యార్థిని కొంతమంది తోటి విద్యార్థులు మాటలతో నమ్మించి, కళాశాల సమీపంలో ఉన్న ఒక తోటలోకి తీసుకెళ్లారు.
అక్కడ గుంపుగా చేరిన విద్యార్థులు బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో, చేతులతో చితకబాదినట్లు సమాచారం. నన్ను వదిలేయండి అంటూ సదరు బాధితుడు చేతులు జోడించి దండం పెడుతున్నప్పటికీ విద్యార్థుల గుంపు అతనిని వదిలిపెట్టలేదు. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. విద్యాసంస్థల యాజమాన్యం దీనిపై ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు. స్థానిక పోలీసులు కూడా ఇంతవరకు ఈ ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులు ఎవరు? అసలు గొడవకు కారణం ఏమిటి? అనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
.jpeg)






