సంగారెడ్డి, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
బుధవారం సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రెస్‌నోట్‌లో వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి. నిన్న సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడిని సీఐ గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టారని తెలిపారు. తన పార్టీ నాయకుడిని రక్షించుకోవడానికి బూత్‌కు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీఐ... తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతినేట్లు చేసిన సీఐని తిట్టడం జరిగిందని జగ్గారెడ్డి వివరించారు.
ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని.. కానీ పది మంది మధ్యలో తమ పార్టీ నాయకుడికి సీఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలను సీఐ లేదా తాను ఉల్లంఘించినా.. అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరూ దానిని స్వాగతించాలని అన్నారు. న్యాయస్థానంలో ఎవరి తప్పు, ఎవరి ఒప్పు తేలుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకే వదిలేశానని చెప్పారు.
మరోవైపు, నిన్న సంగారెడ్డిలో జరిగిన సంఘటనను కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తిప్పారని మండిపడ్డారు. అధికారులపై జగ్గారెడ్డి దాడి చేస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ‘గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని బూతు పదజాలంతో తిట్టారు. తెలంగాణ పోలీసులను తన్ని, తిట్టి, 'ఆంధ్రోళ్లకు పుట్టారా' అంటూ హరీశ్ రావు నీచంగా మాట్లాడారు’ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్, హరీశ్ రావు తిట్టిన విషయాలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవుపలికారు.
.jfif%20(1)_11zon.jpg)






