కుక్కునూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: కుక్కునూరు మండలంలో మీడియా ప్రతినిధుల ఐక్యత, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ‘వారధి ప్రెస్ క్లబ్ అసోసియేషన్’ అధికారికంగా నమోదు చేసి ప్రారంభించారు. మండలంలోని మీడియా మిత్రులందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పాటైందని సంఘం అధ్యక్షులు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సమయమంతుల లక్ష్మణస్వామి మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం దృష్టికి చేర్చే బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడం, ప్రజల సమస్యలపై పోరాడటం తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులకు ఎదురయ్యే వృత్తి సంబంధిత ఇబ్బందులను అధిగమించేందుకు సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు. సభ్యుల సంక్షేమం దృష్ట్యా ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి పథకాలను అమలు చేయడం ద్వారా వారికి భరోసా కల్పించనున్నట్లు వెల్లడించారు.
అదనంగా, జర్నలిస్టుల నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు, చర్చా వేదికలు నిర్వహించడం, ప్రకృతి విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి కార్యాచరణలను అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రెస్ క్లబ్ సొసైటీ అధికారికంగా నమోదు కావడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు టీవీ9 ప్రసాద్, కార్యదర్శి షేక్ చాంద్ పాషా, సహాయ కార్యదర్శి సమయమంతుల దుర్గాప్రసాద్, ఖజాంచి చిన్ని మెండెం, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు మణికంఠ, దావూద్, వేణు, బాబ్జీ, సురేష్ తదితర మీడియా మిత్రులు పాల్గొన్నారు.







