తాజా వార్తలు

10/recent/ticker-posts

బొర్రంపాలెం మత్స్యకార కార్యకలాపాల్లో జోక్యం చేయరాదని కోర్టు ఆదేశం


టి. నరసాపురం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: బొర్రంపాలెం గ్రామానికి చెందిన ఎర్రకాలువ జలాశయంలో మత్స్యకార కార్యకలాపాల్లో ఎలాంటి జోక్యం చేయరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రిజిస్టర్ నెంబర్ 196/ఎఫ్ ముత్యాలమ్మ మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ వెల్లడించారు.


గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎర్రకాలువ రిజర్వాయరులో తమ సంఘానికి చట్టబద్ధమైన లీజు హక్కులు ఉన్నాయని తెలిపారు. అయితే, గత కొంతకాలంగా సంఘంలో లేని కొందరు వ్యక్తులు రేవులో విచ్చలవిడిగా చిన్న చేప పిల్లలు, పెద్ద చేపలను పట్టడం జరుగుతోందని, దీనికి అడ్డు వచ్చిన సంఘ సభ్యులపై దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమ చర్యలపై న్యాయ పరిరక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి సంఘ లీజు కాలంలో మత్స్యకార కార్యకలాపాల్లో ఎలాంటి జోక్యం చేయరాదని స్పష్టంగా ఆదేశించిందన్నారు.

సంఘ సభ్యుల చట్టబద్ధ హక్కులు, జీవనోపాధి పరిరక్షణ కోసం తాము చట్టపరమైన మార్గంలోనే ముందుకు సాగుతున్నామని బత్తుల రమేష్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను అన్ని శాఖల అధికారులు కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా, సంఘానికి చెందని వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను గౌరవించి అక్రమ మత్స్యవేటను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చర్యలు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.