తాజా వార్తలు

10/recent/ticker-posts

“హెల్మెట్ ధరించండి… సురక్షితంగా ఇంటికి చేరండి” – కొయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ హితవు


కొయ్యలగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరాలని కొయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ హితవు పలికారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు పోలవరం డిఎస్పీ శ్రీ ఎం. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు, పోలవరం సీఐ బాల సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్మెట్ అవగాహన డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులపై జరిమానాలు విధించకుండా, వారికి అవగాహన కల్పిస్తూ 20 హెల్మెట్లు కొనుగోలు చేయించి అందజేయడం విశేషం.

ఎస్ఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ… “రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ ప్రమాదం సమయంలో ప్రాణాలను కాపాడే ఏకైక కవచం హెల్మెట్” అని పేర్కొన్నారు.

అతను ప్రజలకు పలు సందేశాలు అందించారు:

  • హెల్మెట్ భారం కాదు – ప్రాణాలకు రక్షణ కవచం.

  • నీ కోసం ఇంట్లో ఎదురుచూసే వాళ్లు ఉన్నారు – హెల్మెట్ మర్చిపోవద్దు.

  • తల రాతను మార్చలేం కానీ, తలకు హెల్మెట్ పెట్టి ప్రమాదాన్ని తప్పించవచ్చు.

  • స్టైల్ కోసం హెల్మెట్ వదలొద్దు – నీ లైఫ్ కోసం హెల్మెట్ ధరించు.

  • బైక్ రేస్ కాదు… నీ ప్రాణమే బాస్. హెల్మెట్ లేకపోతే జీవితం లాస్.

హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

🔹ప్రాణాపాయం నుండి రక్షణ: రోడ్డు ప్రమాదాల్లో మరణాల 80% పైగా తలకు గాయాల వల్లే జరుగుతాయి. హెల్మెట్ ధరించడం వల్ల మెదడు గాయాల ప్రమాదం 70–80% వరకు తగ్గుతుంది.

🔹కంటి రక్షణ: గాలి, ధూళి, పురుగులు కంట్లో పడకుండా కాపాడుతుంది. దృష్టి చెదరకుండా ప్రయాణం సురక్షితంగా సాగుతుంది.

🔹 వాతావరణ రక్షణ: ఎండ, వర్షం, చలి నుంచి తలకు రక్షణ లభిస్తుంది.

🔹ఏకాగ్రత పెరుగుదల: బయటి శబ్దాలు తగ్గి డ్రైవింగ్‌పై దృష్టి కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది.

🔹 జరిమానా నివారణ: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల జరిమానాల నుంచి విముక్తి లభిస్తుంది.

ముఖ్య సూచన

హెల్మెట్ కొనేటప్పుడు తప్పనిసరిగా ISI మార్క్ ఉన్నదో లేదో పరిశీలించాలి. కేవలం జరిమానా తప్పించుకోవడానికే కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికే హెల్మెట్ ధరించాలని ఎస్ఐ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

మీ తల మీ కుటుంబానికి ఆస్తి… దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి” అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు.