తాజా వార్తలు

10/recent/ticker-posts

జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ – 32 హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాస్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు మరియు పోలీస్ సిబ్బంది కలిసి 11న ఈ డ్రైవ్ చేపట్టారు.


తనిఖీల సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి, ఆయా వాహన యజమానులకు నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై జరిమానాలు విధించకుండా, వారితోనే తక్షణమే 32 హెల్మెట్లు కొనుగోలు చేయించి సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత ఆర్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. తమ భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

అతి వేగం మరియు నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరిస్తూ “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి వాహనదారు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణాలు చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు.