ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: చట్టబద్ధమైన దత్తత ద్వారా పిల్లలను స్వీకరించడం అమ్మతనాన్ని ఆస్వాదించే అరుదైన అనుభూతి అని రెండు నెలల క్రితం ఫ్రీ అడాప్షన్ ఫోస్టర్ కేర్ ద్వారా కుటుంబాల్లోకి వెళ్లిన ఇద్దరు బాలికల దత్తత తల్లిదండ్రులు తెలిపారు. వారు ఈరోజు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమక్షంలో హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండు నెలల కాలంలో పిల్లలు కొత్త కుటుంబ వాతావరణంలో ఎలా కలిసిపోయారో, పిల్లలు రాకముందు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి కోసం చేసిన మార్పులు ఏమిటో, పిల్లల సంరక్షణకు ఇంట్లో ఎవరు సహకరిస్తున్నారో, ఆహారపు అలవాట్లు, చదువు ఏర్పాట్లు వంటి అంశాలపై వివరంగా ఆరా తీశారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన అనంతరం ఫైనల్ దత్తత ధృవీకరణ ఉత్తర్వుల ప్రతులను అందజేశారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన దివ్యానంగం–పద్మావతి దంపతులకు ‘తేజశ్రీ’ అనే పాపను, అలాగే సెంథిల్–భానుప్రియ దంపతులకు 10 నెలల వయస్సు గల ‘బేబీ మోక్షజ్ఞ మీనాక్షి’ని అధికారికంగా దత్తత ధృవీకరణ ఆర్డర్ కాపీలు అందించారు. అదేవిధంగా, దత్తత అనంతర ఫాలోఅప్ వివరాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో సేకరించి మిషన్ వాత్సల్య పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్రవేణిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన మిషన్ వాత్సల్య పథకం అమలు అధికారి సిహెచ్ సూర్యచక్రవేణి, శిశు గృహ మేనేజర్ శ్రీమతి పి. భార్గవి తదితరులు పాల్గొన్నారు.







