ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: జిల్లాలో జరగనున్న ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి, కోర్టు భవనాల కోసం స్థలాల కేటాయింపు, కొత్త జిల్లాల్లో భూసంబంధిత సమస్యలు తదితర అంశాలపై చర్చించారు.
సమీక్షలో సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే దిశగా అధికారులు మరింత సమర్థంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
సమీక్ష సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐఓ యోహాన్, డివిఈఓ టి. శేఖర్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.







