ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన ఈపిచెర్ల రమేష్ కుమారుడు ఈపిచెర్ల అజిత్ (15) గురుకుల పాఠశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు.
డా. బీ.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరు రెవెన్యూ డివిజినల్ కార్యాలయంలో మెజిస్టీరియల్ విచారణ నిర్వహించనున్నట్లు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
సంఘటనకు సంబంధించి వివరాలు తెలిసిన వ్యక్తులు, ప్రత్యక్ష సాక్షులు, మరణించిన విద్యార్థి రక్త సంబంధీకులు మరియు సంబంధిత ఇతరులు తమ వద్ద ఉన్న సమాచారం, ఆధారాలతో పేర్కొన్న తేదీ, సమయానికి ఆర్డీఓ కార్యాలయానికి హాజరై వాంగ్మూలం ఇవ్వవచ్చని సూచించారు.
ఈ విచారణ ద్వారా సంఘటనకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.







