జీవో నం.3 పునరుద్ధరణకు అసెంబ్లీలో విజ్ఞప్తి
అమరావతి/పోలవరం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు క్వశ్చన్ అవర్ సందర్భంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనుల హక్కులు, అభివృద్ధి అంశాలపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల భాష, సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. వారి జీవన విధానం ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉండటంతో, ప్రత్యేక పరిరక్షణ అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు గిరిజనుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేశారని గుర్తు చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలో గిరిజనులు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాలు ఆర్థిక, సామాజికంగా వెనుకబడి ఉన్నాయని, గిరిజనులు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు మరియు వారి సమగ్ర అభివృద్ధికి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జీవో 3 అమలులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి, విద్యా అవకాశాలు మెరుగుపడతాయని, సామాజిక భద్రత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, గిరిజనుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సభలో విజ్ఞప్తి చేశారు.







