ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: జిల్లాలో ఈ నెల 17న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహణపై కలెక్టర్ లక్ష్మీశ వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్య తదితర శాఖల అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 1-19 ఏళ్ల వారికి కార్యక్రమాన్ని అమలుచేయడం జరుగుతుందని, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నికల్ తదితర విద్యాసంస్థల విద్యార్థులకు అల్బెండజోల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దాదాపు అయిదు లక్షల మంది చిన్నారులకు ఈ మాత్రలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
ఏడాది నుంచి రెండేళ్ల చిన్నారులకు 200 ఎంజీ అల్బెండజోల్ (చప్పరించి మాత్రమే) ఇవ్వాలని.. అదేవిధంగా మిగిలిన వారికి 400 ఎంజీ సింగిల్ డోస్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నులిపురుగులు వల్ల పిల్లలు నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలు తలెత్తుతాయని.. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య ఆంధ్ర, ఆరోగ్య భారత్ సాకారానికి ఇది చాలా ముఖ్య కార్యక్రమమన్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు. వివిధ కారణాల వల్ల ఫిబ్రవరి 17న మాత్రలు తీసుకోని చిన్నారులకు మాప్ అప్ డే రోజున ఈ నెల 24వ తేదీన అల్బెండజోల్ మాత్ర ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం కోఆర్డినేటర్ డా. జి.మాధవి, డీఈవో ఎల్.చంద్రకళ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, ప్రోగ్రామింగ్ అధికారులు, సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







