ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 13: ఎన్‌టీఆర్ జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీవోఎస్ఎస్) ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖల అధికారులు బృంద స్ఫూర్తితో వ్యవహరించి.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఓపెన్ ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమన్వయ శాఖల సమావేశం జరిగింది.
పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మార్చి 2 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏపీవోఎస్ఎస్ ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. విజయవాడ డివిజన్‌కు సంబంధించి 603 మంది, నందిగామకు సంబంధించి 882 మంది, తిరువూరుకు సంబంధించి 369 మంది మొత్తం 1,854 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. వీటికోసం 11 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లను నియమించడం జరిగిందన్నారు. 144 సెక్షన్ అమలు, బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం అవసరమన్నారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్రజా రవాణా అధికారులు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.
నో సెల్‌ఫోన్ జోన్ నిబంధనలకు కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సన్నద్ధంగా ఉండాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణను కూడా విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీఈవో ఎల్.చంద్రకళ, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.







