ANDHRAPRADESH:రాజకీయం అంటే ప్రజాసేవ, అభివృద్ధే లక్ష్యంగా సాగాలి. కానీ, నేటి రాజకీయాల్లో గెలుపే పరమావధిగా మారింది. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక, వారిపై బురద జల్లడం, ముఖ్యంగా మహిళా నాయకుల క్యారెక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. స్త్రీలను గౌరవించే సంస్కృతి మనది అని చెప్పుకునే సమాజంలోనే, ఎన్నికల ప్రచారాల్లో, బహిరంగ సభల్లో కొందరు రాజకీయ నాయకులు మహిళల వ్యక్తిగత జీవితాలపై, వారి గౌరవంపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆయా మహిళా నాయకులను అవమానించడమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పుగా మారుతోంది. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా తయారవుతోంది. తాజాగా మాజీ మంత్రి రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రోజా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
రోజాపై అనుచిత వ్యాఖ్యలు
రాజకీయాలు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే విలువల్లేని రాజకీయాలు ఆటసాగిస్తున్నాయి. ఒకరిని ఎదుర్కోలేనప్పుడు వారి వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. రాజకీయంగా రోజాను ఎదుర్కోవాలే తప్ప.. వ్యక్తిగత హననానికి పాల్పడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి రోజా గాలి భాను ప్రకాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోజా పై గాలి భాను తీవ్ర వ్యాఖ్యలు
రోజా నేడు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించిందని అంటున్నారని ఆమె తన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. రోజా వ్యాంప్ కు ఎక్కువ హీరోయిన్ కు తక్కువ. ఈ పిచ్చి దానితో వాళ్ల పార్టీ నేతలకు పిచ్చెక్కిందా? లేక ఆయన వలన ఈమెకి పిచ్చి ఎక్కిందో తెలియడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుర్భాషలు ఆడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా? ఫిర్యాదుపై చర్యలేవి? రోజా ఆగ్రహం
పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళితే తన కంప్లయింట్‌ను తీసుకోకుండా ముఖం చాటేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ బాస్‌ల అనుమతి మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని ఆమె ఆరోపించారు.ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆమె వాపోయారు. ఇది కేవలం తనకు మాత్రమే జరిగిన లేదా జరుగుతున్నది కాదని, రాష్ట్రంలో రాజకీయ కక్షలు, విష సంస్కృతి పెరిగిపోతోందన్నారు. మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారని,వారిపై దాడులు జరుగుతున్నాయని, న్యాయం కోసం వెళితే పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారికి మాత్రం రక్షణ కల్పిస్తున్నారని రోజా అన్నారు.
రాష్ట్రంలో ఇది ఒక ప్రమాదకరమైన సంస్కృతి
తనపై భాను ప్రకాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాను మౌనం వహించబోనని చెప్పిన రోజా.. భాను ప్రకాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళ అంటే చులకన భావంతో ఉన్నవారికి కనువిప్పు కలగాలని అన్నారు.రాష్ట్రంలోని ప్రతి మహిళ తరపున తాను పోరాటం చేస్తానని, న్యాయం దక్కేవరకు పోరాటం కొనసాగుతుందన్న రోజా, ఏ మహిళ కూడా ఇలాంటి ఆవేదనకు గురికాకూడదని రోజా ఎమోషనల్ అయ్యారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi