ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు దిగారు.
ఉమ్మడి గుంటూరు తర్వాత.. తాజాగా చిత్తూరు జిల్లా పర్యటనకు పూనుకున్నారు. చంద్రబాబు సొంత జిల్లా ఇది. నేడు బంగారుపాళ్యం వెళ్లనున్నారు జగన్. మామిడి రైతులను పరామర్శించనున్నారు. వారికి అండగా నిలవనున్నారు. తన సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేశారని చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. జగన్ పర్యటనలో పాల్గొన్నవారిపై రౌడీషీట్లు తెరుస్తామని పోలీసులు బెదిరిస్తోన్నారంటూ మండిపడుతున్నారు.
బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వీ కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డు చేస్తోన్నారని సమాచారం. అలాగే- బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టి రైతులను అడ్డుకుంటున్నారని అంటున్నారు.
పోలీసుల తీరుపై మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించడానికి జగన్ వస్తోన్నాడనే కారణంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని నారాయణ స్వామి ఆరోపించారు.
జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన విమర్శించారు. జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు.
ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. హెలిప్యాడ్ వద్ద 30, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదని చెప్పారు.
ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారని నారాయణ స్వామి చెప్పారు. బంగారుపాళ్యం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రైతులు సైతం మార్కెట్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు ఆరోపించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi