తాము దీన్ని ఇంతటితో వదలమని, తమ కుటుంబానికి న్యాయం జరగాలని కీర్తి డిమాండ్ చేశారు.
ANDHRAPRADESH:ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక యువకుడి దారుణ హత్య జరిగింది. ఒక నిండు నూరేళ్ళ యువకుడు మాత్రం బలి అయిపోయాడు. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మహిళా నేత ఆ పార్టీ ఇంచార్జ్ అయిన కోట వినుత దంపతులే తమ అన్న శ్రీనివాస్‌ను హత్య చేయించారని శ్రీనివాస్ అలియాస్ రాయుడు సోదరి తాజాగా ఆరోపించారు.
అయితే ఇప్పటికే కోట వినుతను జనసేన అధినాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించింది. కానీ ఈ మొత్తం వ్యవహారం అయితే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాళెంనికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ యువకుడు కూడా జనసేన పార్టీకి కరడుకట్టిన కార్యకర్త.
రాయుడు కోట వినుత కుటుంబం వద్ద సహాయకుడిగా, డ్రైవర్‌గా పనిచేస్తూ వస్తున్నాడు. ఏకంగా పదిహేనేళ్ళుగా రాయుడు వారి వద్దనే ఉంటున్నాడు. అయితే రాయుడు హత్యకు వినుత, చంద్రబాబు దంపతులే కారణమని చెన్నై పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. వారిని అరెస్ట్ కూడా చేశారు. దీంతో కోట వినుత వ్యవహారం ఏపీలో రాజకీయంగా కాక రేపుతోంది.
ఇక ఈ కేసులో ఏమి జరుగుతుంది అన్నది పక్కన పెడితే శ్రీనివాసులు అలియాస్ రాయుడు వైపు నుంచి చూస్తే ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అని అంటున్నారు. రాయుడుది పేద కుటుంబం అని చెబుతున్నారు. అతనికి అమ్మానాన్న లేరు. తన అమ్మమ్మ వద్దే ఉంటూ జీవితాన్ని నెట్టుకుని వస్తున్నాడు
ఇక తన ఉద్యోగం బాధ్యతలు చూసుకుంటూ అప్పుడప్పుడూ అమ్మమ్మ వద్దకు వెళ్లివస్తున్న రాయుడు జూన్ 21 నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇంతలోనే రాయుడు దారుణంగా హత్యకు గురయ్యాడనే వార్తతో వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు
కోట వినుత వద్ద 15 ఏళ్ల నుంచి తన అన్న పనిచేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అంతే కాదు వాళ్ల దగ్గరే నమ్మకంగా ఉంటూ వస్తున్నాడని చెప్పారు. ఇక ఈ మధ్యన తన అన్నకు కాలికి దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే చూడ్డానికి వెళ్లామని ఆమె చెప్పారు. అయితే ఏం జరిగిందని అడిగితే వాళ్ల మనుషులు మా అన్నయ్యను మాట్లాడనివ్వలేదని ఆమె ఆరోపించారు.
తమ అన్నను జూన్ 21వ తేదీ ఇంట్లో నుంచి పంపిచేశామని వారు చెప్పారని కానీవాళ్ల దగ్గరే పెట్టుకుని చివరకు చంపేశారని అన్నారు. తాను అన్నను చూడడానికి వెళ్లినప్పుడు ఎవరైతే అతని చుట్టూ ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్లే చంపినట్లుగా పోలీసుల అరెస్టుతో బయటపడ్డారని ఆమె అన్నారు.
తాము దీన్ని ఇంతటితో వదలమని, తమ కుటుంబానికి న్యాయం జరగాలని కీర్తి డిమాండ్ చేశారు. తాము కూడా జనసేన పార్టీనే నమ్ముకుని ఉన్నామని ఆ పార్టీ తరపున అధినేత ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.
ఏదో అరెస్టు అని వారిని నాలుగు రోజులు జైళ్లో వేసి వదిలేస్తామంటే ఒప్పుకునేది లేదని ఆమె అంటున్నారు. అలా చేస్తే మరొకరికి ఇలా జరిగే అవకాశం ఉందని కీర్తి చెప్పారు. కోట వినుత దంపతులు జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తామంతా కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లమని ఆమె అన్నారు. అందువల్ల మమ్మల్ని కూడా చంపేస్తామని ఇప్పటికే బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. అంతే కాదు, మా అమ్మమ్మకు డబ్బులిస్తాం ఏమీ చెప్పొద్దని కూడా కోరారని కీర్తి చెప్పారు. మా అన్నను అన్యాయంగా చంపేశారని ఈ విషయంలో తమకు న్యాయం కావాలని కీర్తి కోరుతున్నారు. అంతే కాదు ఎవరు ఎంత పెద్ద తప్పుచేసినా చంపే హక్కు వారికి లేదని కూడా రాయుడు చెల్లెలు కీర్తి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని రాయుడు కుటుంబానికి న్యాయం చేస్తారా అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi