అంతేకాదు.. మంత్రి నారా లోకేష్ ఇతర జిల్లాలు, పట్టణాల్లో పర్యటించిన సమయంలో కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు.
ANDHRAPRADESH:ఏపీలోని కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న టీడీపీ ప్రతి సోమవారం.. ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి సమస్య లు స్వీకరిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరు మాసాల్లో ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద సంఖ్య లో పాల్గొని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఆ తర్వాత కాలంలో ఈ కార్యక్రమం కూడా దాదాపు తగ్గుతూ వచ్చింది. మంత్రి నారా లోకేష్ ఒక్కరు మాత్రమే ప్రతి సోమవారం.. తప్పనిసరిగా ప్రజా దర్బార్ చేపడుతున్నారు. సమస్యలు తీసుకుంటున్నారు.
అంతేకాదు.. మంత్రి నారా లోకేష్ ఇతర జిల్లాలు, పట్టణాల్లో పర్యటించిన సమయంలో కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వాటిని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో స్థానికంగా అధికారులు పరిష్కరించేందుకు వీలున్న వాటికి ముందు ప్రియార్టీ ఇస్తున్నారు. వాటిని పరిష్కరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఆర్థికేతర ఫిర్యాదులను.. అంటే.. ప్రభుత్వంపై భారం పడని ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల సంగతేంటి? అనేది ప్రశ్నగా మారింది.
సీఎం చంద్రబాబు అదిలిస్తే.. కదిలిస్తే.. మాత్రమే మంత్రులు, నాయకులు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. మరికొందరు.. అది కూడా చేయడం లేదు. ఇక, ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమానికి దాదాపు గత ఆరు మాసాలుగా వారు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఇక, పిర్యాదులు ఎక్కడుంటాయని కొందరు మంత్రులు గడుసుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేల సంగతి వేరేగా ఉంది. తాము ఫిర్యాదులు తీసుకోవడం ప్రారంభిస్తే.. వారిపైనే కొందరు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొన్నాళ్లుగా వారు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.
ఇక, ఇప్పటి వరకు స్వీకరించిన ఫిర్యాదులు.. కలెక్టర్లు, సబ్ కలెక్టర్ల కార్యాలయాలతో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే, మంత్రుల ఆఫీసు ల్లో గుట్టలుగా ఉన్నాయి. దీంతో వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారన్నది ప్రశ్న. అంతేకాదు.. అసలు పరిష్కారం అవుతాయా? అవవా? అనే ప్రశ్నలు కూడా తెరమీదికి వస్తున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ప్రజా ఫిర్యాదుల పై స్పందిస్తున్న తీరును తెలుసుకున్న క్రమంలో కొందరు కలెక్టర్లు ఆయా వివరాలను ఆయనకు చేరవేశారు.
గత మూడు నాలుగు నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు తాము చేపడుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమాలకు రావడం లేదని.. విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. మరి ఎలాంటి ఆదేశాలు ఇస్తారు? ఆయా ఫిర్యాదులపై ఆయన ఎలా స్పందిస్తారు? అనేది చూడాలి.

Shakir Babji Shaik
Editor | Amaravathi