ANDHRAPRADESH:తోతాపురి మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు సంధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనీ వదల్లేదు.
తోతాపురి మామిడిని పండించిన రైతులవి తరగని కష్టాలని, ధరల పతనంతో కుదేల్ అయ్యారని షర్మిల అన్నారు. తోతాపురి తీపి కాస్తా ఇప్పడు చేదు అయిందని వ్యాఖ్యానించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతు విలవిలలాడుతుంటే కనీసం పట్టించుకునే పాపాన పోలేదు.
మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. 16 రూపాయలు ధర కడితే తప్పా కోలుకోలేమని రైతులు చెబుతుంటే, 4 రూపాయల కన్నా ఎక్కువ కొనడం లేదని మొత్తుకుంటుంటే, 12 రూపాయలు అందించి న్యాయం చేశామని అబద్ధాలు చెప్పడం సరికాదుని అన్నారు.
తక్షణమే తోతాపురి రైతుల కష్టాలపై ఉన్నత స్థాయి కమిటీని వేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీని కూడా వదల్లేదామె. ఆ పార్టీకి కూడా బాధ్యత ఉందని విమర్శించారు.
నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని షర్మిల ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమి- వైఎస్ఆర్సీపీ మధ్య నడుస్తున్న యవ్వారం ఇదేనని చురకలు అంటించారు. పైకి 500 మందితో అనుమతి ఇస్తారు..10,000 మందితో వచ్చినా సహకరిస్తారని షర్మిల అన్నారు.
పరామర్శల పేరుతో దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తారని షర్మిల చెప్పారు. కళ్ల ముందే జన సమీకరణ జరుగుతున్నా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రేక్షక పాత్ర పోషిస్తారని ధ్వజమెత్తారు. కూటమి వారి ప్రొడక్షన్ లో, పోలీసు శాఖ సెట్టింగ్ లో, బంగారుపాళ్యం వైసీపీ మామిడికాయ సినిమాను రక్తి కట్టించారని సెటైర్లు సంధించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వ సారథ్యంలో రైతుల పరామర్శ పేరుతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నానా యాగీ చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడిగా అభివర్ణించారు. మోదీతో జగన్ కు అక్రమ పొత్తు ఉందని మండిపడ్డారు.
ప్రధాని మోదీ మద్దతుతో జగన్ ఏది చేసినా రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుందని షర్మిల ఆరోపించారు. తలకాయల మీద కార్లు పోనిచ్చినా, మామిడి కాయలు తొక్కుంటూ వెళ్ళినా, రప్పా రప్పా నరుకుతామని బహిరంగంగా హెచ్చరించినా ఆయనపై చీమంత చర్య కూడా ఉండదని అన్నారు. ఇది డబ్బుతో కూడిన బలప్రదర్శన తప్ప జగన్.. రైతుల కోసం చేసిన పోరాటం కానే కాదని అన్నారు. రైతులపై జగన్ ది మొసలి కన్నీరు మాత్రమేనని చెప్పారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi