విశాఖ నుంచి విజయనగరం వెళ్లాలీ అంటే ఇటు తగరపువలస వరకే ఉచితంగా ఉంటుంది. అలాగే అనకాపల్లి వెళ్ళాలంటే గాజువాక దాటితే టికెట్ తీయాల్సిందే అంటున్నారు.
ANDHRAPRADESH:ఏపీలో ఉచిత బస్సుకు రైట్ రైట్ చెప్పేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఉచిత బస్సు పధకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇది సూపర్ సిక్స్ హామీలలో కీలకంగా భావిస్తోంది. దీంతో తాము ఇచ్చిన హమీలలో అత్యధికం నెరవేర్చినట్లే అని అంటున్నారు.
ఇక ఉచిత బస్సు పధకం విధి విధానాలను ప్రభుత్వం ఈసరికే రూపొందించింది అని అంటున్నారు దీని ప్రకారం చూస్తే ఉచిత బస్సు అన్నది కేవలం జిల్లాకే పరిమితం చేయనున్నారు. జిల్లా దాటితే టికెట్ తెగాల్సిందే. చార్జీలు కట్టాల్సిందే అని అంటున్నారు.
మరి ఈ రకమైన షరతు వల్ల మహిళలకు ఎంత మేర ఈ పధకం ప్రయోజనం అన్న చర్చ మొదలైంది. జిల్లాలు చూస్తే ఒకప్పటిలా ఉమ్మడి 13 జిల్లాలు కావు. అవి 26గా మారిపోయాయి. అంటే చిన్న జిల్లాలు అన్న మాట. మరి ఈ చిన్న జిల్లాలలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఎంత సాఫీగా సుఖంగా సాగుతుంది అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.
విశాఖ నుంచి విజయనగరం వెళ్లాలీ అంటే ఇటు తగరపువలస వరకే ఉచితంగా ఉంటుంది. అలాగే అనకాపల్లి వెళ్ళాలంటే గాజువాక దాటితే టికెట్ తీయాల్సిందే అంటున్నారు. అదే విధంగా విజయనగరం జిల్లాను రెండుగా చేశారు. దాంతో ఆ పరిధి కూడా తగ్గిపోయింది.
ఈ కొత్త జిల్లాలలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి కనీసం కన్న వారి ఇంటికి కూడా చేరుకోగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలలో చూస్తే కనుక ఉచిత బస్సు రాష్ట్రమంతటా అని చెప్పారని గుర్తు చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే అటు అన్నవరం స్వామిని ఇటు తిరుపతి వెంకన్న బాబు మరో వైపు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకోవచ్చు అని ఒకటికి పదిమార్లు చెప్పారని అంటున్నారు. అమ్మ వారి ఇంటికైనా
అమ్మ వారి దర్శనానికి అయినా పైసా ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు బస్సులో అని చెప్పారని అంటున్నారు. ఇక తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఉచిత బస్సు పధకం అమలు అవుతోంది రాష్ట్రవ్యాప్తంగానే కదా అని కూడా అంటున్నారు. ఆ పధకాలను చూసి ఏపీలో ప్రవేశ పెట్టినప్పుడు మరి రాష్ట్రమంతటా అన్న విధానాన్ని ఇక్కడ కూడా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఉచిత బస్సు వల్ల సార్ధకత ఉండాలంటే రాష్ట్రమంతా అన్నది అమలు చేయాల్సిందే అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో కూడా ఈ బస్సులు రోజుకు ఎన్ని ట్రిప్పులు నడుపుతారో ఏ వేళలలో నడుపుతారో వాటికి కూడా రూల్స్ ఏమైనా తెస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి ఊరించి ఊరించి వస్తున్న ఉచిత బస్సు ఆచరణలో ఉసూరుమనిపిస్తోంది అని అంటున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi