Hot Posts

6/recent/ticker-posts

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఈ ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరిక..!!


ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతాల్లో,ఉత్తర కోస్తా,దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా ఆదివారం నాడు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 23వ తేదీకి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, యానాం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. శనివారం నాడు తూర్పు-పశ్చిమ ద్రోణి, ఇవాళ దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమ రావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో అయిదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

సోమవారం నాడు విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. అదే విధంగా ..ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు వివరించారు.

తెలంగాణలోనూ నేడు, రేపు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సహా జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi