Hot Posts

6/recent/ticker-posts

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. షెడ్యుల్ ఇలా..


కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలతో ఢిల్లీలో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి

14న తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభకు రాహుల్, ప్రియాంగ లను అహ్వానించనున్న సీఎం రేవంత్ 

రేపు రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్న రేవంత్

HYDERABAD:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో, పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌లను సీఎంఓ కోరినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు.

అలాగే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించనున్నారని సమాచారం.

అలాగే పార్టీలో కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో పార్టీ పటిష్టత, ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అధిష్టానానికి వివరించనున్నారు.

మరోవైపు ఈ నెల 12 నుంచి 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాల వివరాలను కూడా పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ తెలియజేయనున్నారు. మంగళవారం రాత్రికి రేవంత్ ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం. 
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi