వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ యువజన విభాగం భేటీలో తాను ఎలా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టానో, ఆ తర్వాత తనను ప్రత్యర్దులు ఎలా టార్గెట్ చేశారో, చివరికి అధికారంలోకి ఎలా వచ్చారో వివరించారు. పార్టీలో యువజన నేతలు కూడా తనను ఆదర్శంగా తీసుకుని ముందుకొస్తే వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగన్ హామీ ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉండటం రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, ఇందుకోసం సోషల్ మీడియాను వాడుకోవాలని వైసీపీ యువజన విభాగానికి జగన్ సూచించారు. గతంలో ప్రజల్లో ఉంటూ తాను రాజకీయాల్లో ఎలా ఎదిగారో ఆయన నేతలకు వివరించారు. వైసీపీ ప్రారంభించినప్పుడు అందరూ కొత్తవాళ్లేనని, తాను, తల్లి విజయమ్మ మాత్రమే ఉన్నామని గుర్తుచేశారు.
అప్పట్లో ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో తాను గెలిచాక పార్లమెంట్ లో ప్రతీ ఒక్కరూ తనవైపే చూసే పరిస్ధితి వచ్చిందన్నారు. దీన్ని చూడలేక తనపై పగ పట్టారని జగన్ గుర్తుచేసుకున్నారు.
18 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించామని జగన్ గుర్తుచేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసే పోటీ చేశాయన్నారు. 2014 ఎన్నికల్లో 67 సీట్లు గెల్చుకున్నామని, ఇందులో 23 మందిని టీడీపీ లాక్కుందన్నారు. అయినా ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వసనీయతకే పెద్దపీట వేశామని, ఎక్కడా రాజీపడలేదని జగన్ తెలిపారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా జనంలోనే ఉంటూ వారికి చేరువ కావాలన్నారు. అప్పుడు నాయకులుగా ఎదుగుతారని తెలిపారు
రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లోనే ఉందని, మిమ్మల్ని రాజకీయంగా పెంచడం తన చేతుల్లో ఉందని యువజన నేతలకు జగన్ తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, సమర్ధుల్ని పార్టీ వ్యవస్ధల్లోకి తీసుకురావాలని కోరారు. సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రభుత్వ తప్పుల్ని ఎప్పటికప్పుడు జనంలోకి తీసుకెళ్లి ప్రశ్నించాలన్నారు. సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా అందరి దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీలో జోన్ల వారీగా యూత్ ప్రెసిడెంట్లను పెట్టడంతో పాటు పలు మార్పులు చేస్తున్నట్లు వారికి జగన్ తెలిపారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi