వచ్చే 48 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం
వ్యవసాయ, డెయిరీ రంగాలను ఒప్పందం నుంచి మినహాయించాలని పట్టుదల
వస్త్ర, పాదరక్షల ఎగుమతులపై సుంకాల తగ్గింపు కోసం భారత్ డిమాండ్
జులై 9లోగా డీల్ కుదరకపోతే ఇరు దేశాలపై మళ్లీ సుంకాల భారం
ANDRAPRADESH:భారత్, అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలో తెరపడనుంది. వాషింగ్టన్‌లో జరుగుతున్న ఉన్నతస్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నాయని, రానున్న 48 గంటల్లో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని సమాచారం. జులై 9వ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోకపోతే అమెరికా విధించిన సుంకాలపై ఉన్న తాత్కాలిక విరామం ముగియనున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలను వేగవంతం చేశారు.
వ్యవసాయంపై తగ్గేదేలే అంటున్న భారత్
ఈ వాణిజ్య ఒప్పందంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాలు పట్టుదలగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా తమ దేశానికి చెందిన జన్యు మార్పిడి (GM) పంటలను భారత మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. అయితే, దేశీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. వ్యవసాయం, డెయిరీ రంగాల్లోనూ తమ ఉత్పత్తులకు పూర్తిస్థాయి మార్కెట్ ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దేశంలోని గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత దృష్ట్యా ఈ రెండు కీలక రంగాలను ఒప్పందం పరిధి నుంచి మినహాయించాలని భారత వాణిజ్య బృందం గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఉపాధి కల్పించే ఎగుమతులపై భారత్ దృష్టి
అమెరికా డిమాండ్లకు బదులుగా దేశంలో అధిక ఉపాధి కల్పించే తమ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత్ ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల వంటి వాటిపై సుంకాల భారం తగ్గిస్తేనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపు అవుతుందని వాదిస్తోంది. ఈ ఎగుమతులపై సుంకాలు తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యం నెరవేరదని భారత ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
భారత్‌తో ఒప్పందంపై ట్రంప్ సానుకూలత
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్‌తో ఒప్పందంపై సానుకూలంగా స్పందించారు. "భారత్‌తో మేము త్వరలోనే ఓ ఒప్పందం చేసుకోబోతున్నాం. ఇది చాలా తక్కువ సుంకాలతో కూడిన ఒప్పందంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఎవరినీ తమ మార్కెట్లోకి రానివ్వడం లేదు. కానీ వారు త్వరలోనే అనుమతిస్తారని నేను భావిస్తున్నాను. అలా జరిగితే, మేము ఒప్పందం చేసుకుంటాం" అని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు.
ఒకవేళ జులై 9 లోగా ఒప్పందం కుదరని పక్షంలో, ట్రంప్ హయాంలో విధించి, ప్రస్తుతం 90 రోజులుగా నిలిపివేసిన 26% సుంకాలు మళ్లీ అమల్లోకి వస్తాయి. అయితే, ఒకవేళ ఒప్పందం విఫలమైనా మన పోటీదారులతో పోలిస్తే 26% సుంకం మరీ అంత ఎక్కువ కాదని, దానివల్ల భారత్‌కు పెద్ద నష్టం ఉండదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi