విమాన ప్రమాదంపై నివేదిక సమర్పించిన ఏఏఐబీ
తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలన్న రామ్మోహన్ నాయుడు
అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని సూచన
NATIONAL:అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తక్షణమే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమర్పించిన ప్రాథమిక నివేదికపై ఆయన స్పందించారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిభ కలిగిన పైలట్లు, సిబ్బంది మనకు ఉన్నారని, వారు విమానయాన రంగానికి వెన్నుముక వంటి వారని మంత్రి అన్నారు. వారే విమానయాన రంగానికి ప్రధాన వనరులని, వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఎటువంటి నిర్ధారణకు రాకుండా తుది నివేదిక కోసం వేచి చూద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అనేక సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే నివేదికపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ 15 పేజీలతో కూడిన ప్రాథమిక నివేదికను ఇటీవల సమర్పించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆగిపోయినట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఒక పైలట్ మరో పైలట్‌ను ఆ స్విచ్ ఎందుకు ఆపివేశావని ప్రశ్నించగా, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరొక పైలట్ చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. కాక్‌పిట్‌లో పైలట్ల చివరి మాటలు ఇవేనని ఏఏఐబీ తెలిపింది. ఆ తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని పేర్కొంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi