తాజా వార్తలు

10/recent/ticker-posts

వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు కొరత లేదని అధికారులు భరోసా


డిమాండ్‌ను ‘క్యాష్‌’ చేసుకుంటున్న ఏజెన్సీలు

స్టాక్‌ ఉన్నా దాచిపెట్టి కృత్రిమ కొరత
బ్లాక్‌ మార్కెట్‌కు సిలిండర్ల తరలింపు
తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌ హెచ్చరిక

అమరావతి, మార్చి 13: వంట గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు కొరత లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. మరోవైపు దొరకవేమో అన్న భయంతో ఎల్పీజీ వినియోగదారులందరూ ఆన్‌లైన్‌లో ఒకేసారి బుక్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లు క్రాష్‌ అయిపోతున్నాయని గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితులను సాకుగా చూపిస్తూ కొందరు గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్ల డెలివరీని కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. 

మరికొన్ని ఏజెన్సీల్లో సిలిండర్ల స్టాక్‌ ఉన్నప్పటికీ దాచిపెడుతున్నారని, లాభాపేక్షతో కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులూ ఉన్నాయి. దీంతో తాము నానా కష్టాలు పడాల్సి వస్తోందని గృహ వినియోగదారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ వెంటనే స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్‌ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, గృహావసరాలకు కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

రోజువారీగా పర్యవేక్షణ: గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ డైరెక్టర్‌ శ్రీవాస్‌ నూపుర్‌ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీని ‘ఎస్మా’ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిందని తెలిపారు. ‘రాష్ట్రంలో గృహావసరాలకు గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రులు.. ఇలా ప్రాధాన్య రంగాలకు కూడా గ్యాస్‌ సరఫరా సజావుగానే కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వ్యాపార అవసరాలకు గ్యాస్‌ సరఫరాను నియంత్రించమని కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్టాక్‌ పాయింట్లు, గ్యాస్‌ ఏజెన్సీల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా ఎన్ని డొమెస్టిక్‌, కమర్షియల్‌ సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి? అవి ఎక్కడకు వెళ్తున్నాయనేది కూడా రోజువారీ మానిటరింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఫిర్యాదులు చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశాం’ అని నూపుర్‌ భరోసా ఇచ్చారు.

చర్యలు తీసుకుంటాం: పయ్యావుల
ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా), సాధారణ హోటళ్ల అసోసియేషన్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిశారు. తమ ఇబ్బందులను వారు మొరపెట్టుకున్నారు. 60 శాతమైనా కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. హోటల్‌ నిర్వాహకుల సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. గ్యాస్‌ సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. ఉన్నతాధికారులు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో చర్చించి తగు చర్యలు తీసుకుంటానని పయ్యావుల హామీ ఇచ్చినట్లు హోటళ్ల జేఏసీ ప్రతినిధులు తెలిపారు.