తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం
రెండు దుకాణాలు, చలువ పందిళ్లు దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్న అధికారులు
ANDRAPRADESH:తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ రోజు వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గరలో ఉన్న రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగగా, ఆ తర్వాత అవి పక్క దుకాణానికి, ఆలయం ముందు వేసిన చలువ పందిళ్లకు వ్యాపించాయని చెబుతున్నారు.
భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా దుకాణాల్లోని ఇత్తడి సామాన్లు, బొమ్మలు కాలిపోయాయి. ఒక దుకాణంలో విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi