HYDERABAD:సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఇండస్ట్రియల్ హబ్‌లో మరోసారి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే జూన్ 27న రాత్రి సిగాచి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జూన్ 27న రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ దారుణ ఘటన నుంచి రాష్ట్రం తేరుకోకముందే.. ఇప్పుడు లేటెస్ట్ గా మరో ప్రైవేట్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. దీంతో పరిశ్రమల భద్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాశమైలారంలోని మరో ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కార్మికులు తక్షణమే పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా సిగాచి రియాక్టర్ పేలుడు ఘటనలో 44 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడిన కార్మికులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనల్లో ఒకటిగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించింది.
అయితే ఇండస్ట్రియల్ జోన్ లో ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల యజమానులు సురక్షిత చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కఠినమైన భద్రతా మార్గదర్శకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi