ANDHRAPRADESH:తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. కొండ పైన భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. రేపు తిరుమలలో కోయిల్ అల్వాల్ తిరుమంజనం జరగనుంది. దీంతో.. రెండు రోజుల పాటు బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. కాగా.. ఆదివారం రద్దీ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే తన మద్దతు దారులతో వచ్చి.. ప్రోటోకాల్ దర్శనం కోసం టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తిట్ల దండకం అందుకున్నారు. ఉన్నతాధికారుల జోక్యం చేసుకొని సర్దిచెప్పి పంపారు.
తిరుమలలో అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. టీటీడీ సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించారు. చిత్తూరుజిల్లా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ తిరుమల లో హల్‌చల్ చేశారు. శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఈయన తోపాటూ మరో 9మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ జారీ చేసింది. అలాగే తనతో వచ్చిన మరో ఆరుగురికి వేరే రిఫరెన్స్‌లో సాధారణ వీఐపీ బ్రేక్ టికెట్లు పొందారు. అయితే వీరిని కూడా తనతో పాటూ క్యూకాంప్లెక్స్ 1లోని ప్రొటోకాల్ లైన్‌లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. కాగా, వారిని టీటీడీ సిబ్బంది అనుమతించలేదు.
దీంతో, ఎమ్మెల్యే ఆగ్రహం తో వారితో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది పై తిట్లకు దిగడమే గాక బలవంతంగా తన అనుచరులను నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్టు తెలిసింది. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిప్యూటీఈవో, విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
వారిమీద కూడా ఎమ్మెల్యే థామస్ విరుచుకుపడినట్టు తెలిసింది. వివాదం పెద్దదవడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకి సర్దిచెప్పి పంపారు. చివరకు వారిని జనరల్ బ్రేక్ లోనే దర్శనానికి అనుమతించారు. అయితే, ఎమ్మెల్యే అయి ఉండి.. శ్రీవారి ఆలయంలో ఇలాంటి ప్రవర్తన ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు వైరల్ గా మారటం.. ఎమ్మెల్యే తీరు పైన అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi