వైసీపీ అధికారంలో ఉండగా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు) పార్టీ ఓటమి పాలయ్యాక ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అవంతి విద్యాసంస్థల అధిపతి అయిన ఆయన.. వైసీపీ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో జగన్ కూడా ప్రత్యామ్నాయాల్ని వెతికేసుకున్నారు.
దీంతో ఇప్పుడు కూటమిలోకి తన ఎంట్రీకి అవంతి శ్రీనివాస్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను ఓసారి అనకాపల్లి ఎంపీగా గెలిచిన టీడీపీలోకి ఫిరాయించేందుకు ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి సైలెంట్ గా ఉండటంతో పాటు ఎక్కడా కూటమి పార్టీలపై విమర్శలు కూడా చేయకుండా, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మౌనం వహిస్తున్న అవంతిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ కూడా సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు టీడీపీలో ఉండగానే రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ తో కలిసి పలు పదవులు అనుభవించిన అవంతి శ్రీనివాస్.. ఆ తర్వాత ఆయనతో విభేధించి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. చివరికి ఆయన చేతిలోనే గత ఎన్నిక్లలో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తును తిరిగి కూటమిలోనే వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కూటమిలోని తన సన్నిహిత నాయకులతో రాయబారాలు పంపి సక్సెస్ అయినట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయనకు టీడీపీ కండువా కప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే టీడీపీలో మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తిగా ఉన్న అవంతి రాజకీయ గురువు గంటా శ్రీనివాస్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడే సీటులో ఆయనకు ఎమ్మెల్యే సీటుపై హామీ రావడంతో టీడీపీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలోనే భీమిలికి పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో అవంతికి సీటుపై హామీ ఇచ్చినట్లు సమాచారం.

Shakir Babji Shaik
Editor | Amaravathi