Hot Posts

6/recent/ticker-posts

వాలంటీర్ల ఊసు వినబడదంతే....వైసీపీ సైతం అంతే !


మరి ఇంతగా చేదు అయిన వాలంటీర్ల వ్యవస్థ విషయంలో వైసీపీ ఎందుకు తన ఆలోచనలు మార్చుకుంది అన్నది పెద్ద ప్రశ్న అయితే కావచ్చు, జవాబు మాత్రం వెరీ సింపుల్.

ANDHRAPRADESH:తాము సృష్టించిన ఒక గొప్ప వ్యవస్థ అని ఒకనాడు ఘనంగా చెప్పుకున్నారు. ఇపుడు అదే వ్యవస్థ పేరు వింటేనే వణుకుతున్నారు. ఇంతకీ ఆ వ్యవస్థ ఏమితి అంటే వాలంటీర్ వ్యవస్థ. ఒకనాడు దేశంలోనే రోల్ మోడల్ గా ఏపీ ఉందని పాలనా సంస్కరణలలో ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన వ్యవస్థను తామే క్రియేట్ చేశామని చెప్పుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి వాలంటీర్ల వ్యవస్థను అధ్యయనం చేసి వెళ్తున్నారని కూడా ప్రచారం చేసుకున్నారు.

అయిదేళ్ళ పాటు ఇదే విధంగా ఊదరగొట్టారు కానీ ఇపుడు చూస్తే ఆ వ్యవస్థ వద్దే వద్దు అని అంటున్నారు. నిజానికి ఈ వ్యవస్థను తీసుకుని వచ్చింది ఎవరో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వారు అయినట్లుగా మాట్లాడుతున్నారు. తామే ఆ వ్యవస్థకు శ్రీకారం చుట్టామని ప్రాణం పోసి అంకురార్పణ చేశామని అసలు ఆలోచించడం లేదు, ఏ మాత్రం అనుకోవడం లేదు.

మరి ఇంతగా చేదు అయిన వాలంటీర్ల వ్యవస్థ విషయంలో వైసీపీ ఎందుకు తన ఆలోచనలు మార్చుకుంది అన్నది పెద్ద ప్రశ్న అయితే కావచ్చు, జవాబు మాత్రం వెరీ సింపుల్. వాలంటీర్ల వ్యవస్థ వల్ల వైసీపీ ఘోరంగా ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. పధకాలు తాము అందిస్తున్నామని తమ వారుగా వాలంటీర్లు వెళ్ళి అంతా మంచిగా చెబుతున్నారు అనుకుంది. ఆ మంచే తమకు గెలిపిస్తుందని భావించింది. ఇక్కడ ఒక పార్టీగా రాజకీయ వ్యవస్థగా జనాల వద్దకు వెళ్ళాలన్న ఆలోచన వైసీపీ మరచింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే వాలంటీర్ల వ్యవస్థను దాని మానాన అలా ఉంచి కేవలం పౌర సేవలకే పరిమితం చేసి ఉంటే ఏ రాజకీయ మకిలీ అంటేది కాదు, కానీ వాలంటీర్లు అంతా మావారే అని ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు అంతా చెప్పుకొచ్చారు. వాలంటీర్లకు అలా వైసీపీ రంగు పూసే ప్రయత్నం వారే చేస్తే దానికి మరింతగా అంటించాల్సింది అంటించింది విపక్షం. ఎందుకు అంటే వాలంటీర్లను రాజకీయంగా వాడుకోవాలని ఎపుడైతే వైసీపీ డిసైడ్ అయి స్థానిక ఎన్నికల్లో ప్రయోగం చేసిందో నాటి నుంచే విపక్షాలు కూడా కత్తి కట్టాయి.

అలా వాలంటీర్ల వ్యవస్థ మీద నాటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయారని కాదు కానీ ఇంటి వద్దకే పౌర సేవలు అందే ప్రజలకు మాత్రం ఇబ్బంది అయితే కలిగింది. నిజానికి రాజకీయంగా చూడకుండా ఆ కోణం నుంచి ఆలోచన కూడా చేయకుండా ఆదర్శవంతమైన తీరున ఈ వ్యవస్థను నడిపితే అటు చిరుద్యోగులకూ మేలు జరిగేది ఇటు ప్రజలకు పౌర సేవలు వారి గుమ్మాలకే అంది ప్రయోజనం చేకూరేది. అలా అంతా కలసి ఒక మంచి ఆలోచనను చంపేశారు అని అంటున్నారు.

నిజానికి ఏ సంస్కరణ అయినా ఏ ప్రయోగం అయినా ఎన్నో పురిటి నొప్పులను తట్టుకుని బయటకు వస్తుంది. బాలరిష్టాలు ఎన్నింటినో దాటితేనే తప్ప అది గాడిన పడి రాటు దేలదు, కానీ వాలంటీర్ల వ్యవస్థ విషయంలో సృష్టికర్తలే అతి చేసి దాని గతి మార్చారు అన్నది అంతా అంటున్న మాట. ఇపుడు చూస్తే కూటమి ప్రభుత్వం ఎటూ వాలంటీర్ల ఊసు తలవదు, వైసీపీ కూడా వద్దు అనుకుంటోంది. దాంతో వాలంటీర్లు అన్న వ్యవస్థ చరిత్రలో కలసిపోయింది అని కచ్చితంగా చెప్పాల్సిందే.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi