ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే తొలి చార్జిషీటు వేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) త్వరలో అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని ప్రకటించింది.
ANDHRAPRADESH:ఏపీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే తొలి చార్జిషీటు వేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) త్వరలో అనుబంధ చార్జిషీటు దాఖలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇదే అంశంలో మనీలాండరింగుపై కేసు నమోదు చేసిన కేంద్ర సంస్థ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాత్రం లిక్కర్ కేసును సీరియస్ గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర సర్కారును నడుపుతున్న బీజేపీతో వైసీపీకి ఉన్న తెరచాటు సంబంధాలేనంటూ అధికార టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో బిగ్ బాసును తెరపైకి తేవడానికి ఈడీని వాడుకోవాలని టీడీపీ భావించగా, ఈడీ అధికారుల వైఖరితో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారని, ఆయన మాస్టర్ మైండుతో త్వరలోనే ఈడీ కేసులో పురోగతి ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంపై పార్లమెంటులో చర్చించాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ మద్దతుతోనే ప్రధాని మోదీ మూడోసారి అధికారంలో కొనసాగుతున్నారనేది నిర్వివాదాంశం. అయితే చంద్రబాబు మద్దతు ఇస్తున్నంత మాత్రాన ఏపీలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తు పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా బీజేపీ పెద్దల్లో ఉందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో ప్రతిపక్షం గతంలోనూ, ఇప్పుడు తమకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని లిక్కర్ స్కాంపై ఆచితూచి అడుగులేస్తోందని అంటున్నారు. దీనిపై టీడీపీలో కూడా అసంతృప్తి ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి ఉండటంతో లిక్కర్ కేసుపై కాస్త సమయం తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఈ కేసు విషయంలో ఈడీ దూకుడుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే లిక్కర్ కేసులో బిగ్ బాస్ ను అరెస్టు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ పనికి ఈడీని వాడుకోవాలని భావిస్తోందని అంటున్నారు. బిగ్ బాస్ ను సిట్ అరెస్టు చేసే కన్నా, ముందుగా ఈడీ ద్వారా అదుపులోకి తీసుకుంటే అన్నిరకాలుగా పైచేయి సాధించొచ్చని ప్రభుత్వ పెద్దల వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈడీ ద్వారా బిగ్ బాస్ ను విచారించేందుకు నోటీసులిప్పిస్తే, ఆయన పాత్రను కేంద్రమే నిర్ధారించిందన్న అభిప్రాయం వ్యాప్తి చేయడంతోపాటు బీజేపీ, వైసీపీ సంబంధాలను కూడా దెబ్బతీయొచ్చని వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు దెబ్బతినడంతోపాటు వైసీపీ శ్రేణులను నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు.
మరోవైపు ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్ లిక్కర్ స్కాంలో దూకుడుగా వ్యవహరించిన ఈడీ, ఏపీ లిక్కర్ స్కాంపై నత్తనడకన నడుస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ పరిణామం టీడీపీ అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. తమ మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలపై ఒత్తిడి తేలేకపోతున్నారని, ఆయన మెతక వైఖరి వల్ల పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతున్నారని టీడీపీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ భావన మరింత వ్యాప్తి చెందితే అసలుకే ఎసరు వస్తుందన్న ఆలోచనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లిక్కర్ స్కాంపై కేంద్ర వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. అందుకే ఇన్నాళ్లు తెరచాటుగానే కేంద్ర పెద్దలతో చర్చలు జరిపగా, తాజాగా అఖిలపక్షం సమావేశంలో చర్చకు తీసుకువచ్చి, పార్లమెంటులోనూ చర్చించాలని అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల వైసీపీపై రాజకీయంగా పైచేయి సాధించొచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
ప్రధానంగా పార్లమెంటులో వైసీపీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితి లేకపోవడం, అధికార పక్షంగా సభలో ప్రవేశపెట్టే అంశంపై బీజేపీ నేతలను భాగస్వామ్యం చేసి లిక్కర్ స్కాంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని టీడీపీ పెద్దలు రచించినట్లు చెబుతున్నారు. దీనివల్ల బీజేపీ రాజకీయంగా ఇరుకున పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు తెరముందు టీడీపీ, తెరచాటుగా వైసీపీతో సంబంధాలు నెరిపిన బీజేపీ పెద్దలు.. ఇకపై రెండింట్లో ఏదో ఒకపక్షంతోనే పయనం సాగించే పరిస్థితిని తీసుకురావాలని పసుపు పార్టీ నేతలు రచించిన వ్యూహం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనేది ఆసక్తి రేపుతోంది. టీడీపీ వ్యూహం పనిచేస్తే వైసీపీతోపాటు బీజేపీ కూడా ఇరుకున పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi