ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యం గా వ్యూహాలు అమలు చేస్తోంది. మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్ గా కొత్త కార్యాచరణ తో ముందుకు వెళ్తున్నారు. పార్టీ వీడిన మాజీ నేత విజయ సాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. సాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం. ఇదే సమయంలో సాయిరెడ్డికి తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో, రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
సాయిరెడ్డికి నోటీసులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మాజీ వైసీపీ నేత విజయ సాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జులై 12వ తేదీన సిట్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే రెండు సార్లు విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్ రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అని ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని.. కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక, ఇప్పుడు రెండోసారి సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.
జగన్ ఆహ్వానం..?
పార్టీ వీడిన సాయిరెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు వైసీపీ నేతల్లో ప్రచారం సాగుతోంది. వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి.. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు. జగన్ తో పాటుగా జైలుకు వెళ్లారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావటంతో పాటుగా.. ఢిల్లీ - ఏపీ మధ్య అనుంసధాన కర్తగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పరాజయం తరువాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. వైసీపీని వీడటంతో పాటుగా రాజకీ యాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
వాట్ నెక్స్ట్
విజయ సాయిరెడ్డి తిరిగి త్వరలోనే జగన్ తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతోంది. సాయిరెడ్డి పార్టీ వీడటం .. రాజ్యసభకు రాజీనామా చేయటం పైన జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా, సాయిరెడ్డి తాను జగన్ కు నష్టం చేసే పనులు చేయనని క్లారిటీ ఇచ్చారు. కూటమిలో సాయిరెడ్డి ఎంట్రీకి ముఖ్య నేతలు అడ్డుపడినట్లు ప్రచారం ఉంది. సాయిరెడ్డి విచారణలకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. అయితే, ఆ తరువాత సాయి రెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాలలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అటు వైసీపీ నేతలు సాయిరెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఈ సమయంలో.. సాయిరెడ్డి మరోసారి లిక్కర్ కేసులో సిట్ ముందుకు వస్తుండటం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi