ANDHRAPRADESH:తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో మకాం వేసారు. రాష్ట్ర బీజేపీలో ముఖ్య నాయకత్వం పైన ఆగ్రహం గా ఉన్న రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా ఆమోదం పైన నిర్ణయం కేంద్ర పార్టీ నాయ కత్వం తీసుకోవాల్సి ఉంది. కాగా, రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు కోరుతూ బీజేపీ స్పీకర్ కు లేఖ రాసేందుకు సిద్దమైంది. ఇదే సమయంలో రాజాసింగ్ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న రాజకీయం ఈ మొత్తం ఎపిసోడ్ లో కీలక మలుపుగా మారుతోంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ లో కొనసాగుతూనే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ నిర్ణయాల పైన కొంత కాలంగా రాజాసింగ్ ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక సమయంలో రాజాసింగ్ తాను పోటీకి సిద్దపడగా అడ్డుకున్నారని ఆరోపించారు. అదే సందర్భంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖ అందించారు. అయితే, పార్టీ రాష్ట్ర నాయక త్వం రాజాసింగ్ రాజీనామా పైన అధినాయకత్వానికి సమాచారం ఇచ్చింది. అక్కడ నుంచి ఇంకా ఏ నిర్ణయం రాలేదు. ఇటు బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి పైన అనర్హత వేటు కోరుతూ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్దం అవుతోంది.
ఇదే సమయంలో రాజాసింగ్ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ లోని కొందరు ముఖ్య నేతలకు కలిసి తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. తన రాజీనామాకు కారణాలు.. కొందరు సీనియర్లు వ్యవహరిస్తున్న తీరు పైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు పార్టీ అధి నాయకత్వంతో సమస్య లేదని.. రాష్ట్ర పార్టీలో కొందరు నేతల తీరు తోనే మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. తన రాజీనామా పైన పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టబడి ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావుకు రాజా సింగ్ తాజాగా కీలక సూచనలు చేసారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామచందర్ రావుకు మంచి అవకాశం దొరికిందన్నారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆయనకు సూచించారు. ఇక, ఇప్పుడు రాజాసింగ్ ఢిల్లీలో మకాం వేయటం రాజకీయం గా ఆసక్తి కరంగా మారుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi