టీ. నర్సాపురం, పశ్చిమ వాహిని, మార్చి 15: రహదారి భద్రతపై వాహనదారుల్లో అవగాహన పెంపొందించేందుకు టీ. నర్సాపురం పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి జరిమానా విధించకుండా, అక్కడికక్కడే హెల్మెట్ కొనుగోలు చేయించే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాలు, పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు సూచనల మేరకు, జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో టీ. నర్సాపురం ఎస్సై జయబాబు తమ సిబ్బందితో కలిసి “నో ఫైన్ – బై హెల్మెట్” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, జరిమానా విధించకుండా వారికి హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వారి చేతులమీదుగానే అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి ధరించేలా చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని వాహనదారులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై జయబాబు మాట్లాడుతూ పోలీసుల లక్ష్యం జరిమానాలు వసూలు చేయడం కాదని, ప్రతి వాహనదారుడు సురక్షితంగా తన ఇంటికి చేరుకోవడమే ముఖ్యమని అన్నారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
ఈ వినూత్న కార్యక్రమం వాహనదారుల్లో మంచి స్పందన పొందిందని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



.jpeg)








