Hot Posts

6/recent/ticker-posts

ఆ రెండు మూవీలతో రూ.36 కోట్లు వైట్ లోకి?.. లిక్కర్ స్కాంలో కొత్త కోణం!

ఏపీలో జరిగినట్లుగా భావిస్తున్న లిక్కర్ స్కాం లెక్కలు తేల్చేందుకు రంగంలోకి డిగిన సిట్.. కొత్త కోణాల్ని వెలికి తీస్తోంది.

ANDHRAPRADESH:ఏపీలో జరిగినట్లుగా భావిస్తున్న లిక్కర్ స్కాం లెక్కలు తేల్చేందుకు రంగంలోకి డిగిన సిట్.. కొత్త కోణాల్ని వెలికి తీస్తోంది. మద్యం కుంభకోణంలో భాగంగా.. నల్లధనాన్ని వైట్ చేసుకోవటం కోసం రెండు సినిమాల్ని నిర్మించటం.. అందులో భాగంగా దాదాపు రూ.36 కోట్ల మొత్తాన్ని వైట్ చేసుకున్న వైనాన్ని గుర్తించారు. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి లీలల్ని గుర్తించారు. లిక్కర్ స్కాం డబ్బులతో సినిమాలు తీసిన వైనాన్ని గతంలోనే గుర్తించిన విచారణ అధికారులు.. తాజాగా దానికి సంబంధించిన కీలక అంశాల్ని వెలికి తీసినట్లుగా తెలుస్తోంది.

ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో ఒక చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన రాజ్ కసిరెడ్డి.. సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది.. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాన్ని నిర్మించినట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ రెండు సినిమాలకు రూ.40 కోట్లు నల్లధనాన్ని వెచ్చించినట్లుగా సిట్ గుర్తించింది. అయితే.. నిర్మాణ సంస్థ మాత్రం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లుగా లెక్కలు చూపి.. అప్పులు తీసుకొని సినిమాలు తీసినట్లుగా రికార్డుల్లో నమోదు చేసినట్లుగా తేల్చారు.

సిట్ అనుమానించినట్లే అవన్నీ దొంగ లెక్కలని తేలినట్లు తెలుస్తోంది. మద్యం డిస్టలరీలు.. డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి నగదు తీసుకొని..రాజ్ కసిరెడడి ముఠాకు కొందరికి అందజేసేవారని.. ఆ తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ ఖాతాలో జమ చేసేవారని గుర్తించారు. మళ్లీ మొదలైంది.. స్పై సినిమాలను ఎంత బడ్జెట్ తో నిర్మించారు? రికార్డుల్లో ఎంత చూపించారు? ఈ సినిమాలకు జరిగిన వ్యాపారం ఎంత? లాంటి పలు ప్రశ్నలను ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ కు సీఈవోగా వ్యవహరించిన ఉఫ్పలపాటి చరణ్ తేజ్ ను సిట్ విచారించింది.

ఈ క్రమంలో కొత్త అంశాలు వెలుగు చేశాయి. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ఈ సినిమాలకు ఓటీటీ.. ఇతర హక్కులన్ని కలిపి రూ.36 కోట్లకు అమ్మినట్లుగా తేల్చారు. మొత్తంగా రూ.40 కోట్ల బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు చేసిన లీలల్ని సిట్ అధికారులు తాజాగా కోర్టు ఎదుట ఉంచారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సినిమాలు తీస్తున్నట్లుగా ప్రకటించి.. కొన్ని ప్రాజెక్టుల కోసం డబ్బులు కుమ్మరించినట్లు చెబుతారు. ఇందులో భాగంగా పలువురు డైరెక్టర్లతో స్క్రిప్టులను చర్చించి.. సినిమాలు తీసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో అప్పటి నుంచి ఈ సంస్థ డీయాక్టివేట్ అయినట్లుగా గుర్తించారు.

నిఖిల్ సిద్ధార్థ్ కు రూ.10 కోట్లు పారితోషికంగా చెల్లించి.. రికార్డుల్లో మాత్రం రూ.90 లక్షలు మాత్రమే చూపించినట్లు గుర్తించారు. ఈ సినిమా షూటింగ్ లో అత్యధిక భాగాన్ని జోర్డాన్ లో చిత్రీకరించారు. హీరోతో సహా యూనిట్ ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపింది. ఆశ్చర్యకరంగా అసలు జోర్డాన్ లో షూటింగ్ కు సంబంధించిన ఖర్చుల్ని చూపని వైనాన్ని సిట్ గుర్తించింది. చివరకు ప్రయాణ టికెట్ల లెక్క కూడా లేకపోవటం చూస్తే.. నల్లధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా లిక్కర్ స్కాంలో నల్లధనాన్ని వైట్ చేసేందుకు సినిమా రంగాన్ని వాడుకున్నట్లుగా తేలింది.


Author

Shakir Babji Shaik

Editor | Amaravathi