కుప్పం నియోజకవర్గంలో ఘటన
భర్త అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసిన వైనం
టీడీపీ నేతలు బరితెగిస్తున్నారన్న రోజా
ANDRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై వైసీపీ నేత రోజా ధ్వజమెత్తారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదన్న నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి, దాడి చేసి, అమానుషంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఇలాకాలోనే మహిళలకు రక్షణ కరువైందని, అధికారం అండతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని రోజా మండిపడ్డారు.
అప్పు తీర్చలేదని ఒక ఆడబిడ్డను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన దారుణమని అన్నారు. అధికారం చేతిలో ఉంటే విచక్షణ మరిచిపోయి ఇంతలా బరితెగిస్తారా అని ఆమె ప్రశ్నించారు.
ఇదేనా మహిళలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం అంటూ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.