హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగర పరిధిలోని మాదాపూర్ లోని సున్నం చెరువులో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగిస్తోంది. ఈరోజు ఉదయం నుండి హైడ్రా అధికారులు మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా అధికారులు తొలగిస్తున్నారు.
మాదాపూర్ సున్నంచెరువులో జోరుగా అక్రమ నీటి వ్యాపారం.. హైడ్రా కొరడా
మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా అధికారులు సూచించారు. సున్నం చెరువులో ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయి అని తన పరిశోధనలలో తేల్చిన హైడ్రా ఈ నీటిని తాగవద్దని సూచించింది.
బోర్లు వేసి నీరు సరఫరా చేస్తున్న వ్యక్తిపై హైడ్రా కేసు
అయితే ఈ చెరువు పక్కన మూడు బోర్లు వేసిన ఒక వ్యక్తి ఈ నీళ్లను ట్యాంకర్ల ద్వారా మాదాపూర్ లోని ఐటీ కంపెనీలకు, ప్రైవేట్ హాస్టళ్లకు, విద్యాసంస్థలకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇక ఈ నీటిని కొందరు ప్యూరిఫై చేసి తాగడానికి ఉపయోగిస్తూ ఉండగా, కొందరు మిగతా పనుల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బోర్లు వేసి నీటి సరఫరా చేస్తున్న వ్యక్తి పైన హైడ్రా కేసు నమోదు చేసింది.
ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
అంతేకాదు చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటర్ లను తొలగించడంతో పాటు, సున్నం చెరువు పరిధిలోని ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను కూడా తొలగిస్తోంది. చెరువు పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును అభివృద్ధి చేస్తోంది హైడ్రా. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు.
చేస్తున్న హైడ్రావాటర్ ట్యాంకర్ లను సీజ్
ప్రస్తుతం వాటిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను కూడా హైడ్రా అధికారులు సీజ్ చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగింపు చేస్తున్న హైడ్రా అధికారులు ఎవరైనా సరే ఆక్రమణలకు పాల్పడితే తొలగించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.
వరుస కూల్చివేతలతో కబ్జాల చెర నుండి చెరువులు, భూములకు విముక్తి ఇదిలా ఉంటే మూడు వారాల క్రితం రసూల్పుర సెంటర్లోని ప్యాట్నీ నాలాను అనుకుని నిర్మించిన ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కడ ఆక్రమణలకు పాల్పడినా అక్కడ రంగంలోకి దిగుతున్న హైడ్రా అధికారులు వరుస కూల్చివేతకు పాల్పడుతూ కబ్జాల చెరల నుంచి భూములను కాపాడుతున్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi