243 వాహనాల మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం
రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను తొక్కించిన అధికారులు
ట్రాఫిక్ ఉల్లంఘనలపై సీసీ కెమెరాలతో నిఘా
కరీంనగర్ నగరంలో మితిమీరిన శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న 243 వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని, వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతకాలంగా నగరంలో కొందరు యువకులు వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి, అధిక శబ్దాలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి, మొత్తం 243 వాహనాలను గుర్తించి, వాటి సైలెన్సర్లను తొలగించినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లన్నింటినీ రోడ్డు రోలర్ కింద వేసి పూర్తిగా ధ్వంసం చేయించారు.
సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
ఇకపై కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామని సీపీ గౌష్ ఆలం స్పష్టం చేశారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శుక్రవారం నుంచి నిఘాను ప్రారంభించినట్లు తెలిపారు. సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రాంగ్-సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడటం, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనలను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, సంబంధిత వాహనదారులకు చలాన్లు పంపిస్తామని హెచ్చరించారు.
మద్యం తాగి వాహనాలు నడిపే వారిని పట్టుకుని, వారి వాహనాలను కోర్టులో డిపాజిట్ చేయాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ బి. యాదగిరి స్వామి, సీఐలు కరీం ఉల్లఖాన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi