బంగ్లాదేశ్‌లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం
ప్రధాన నిందితుడు, బీఎన్పీ నేత ఫజోర్ అలీ సహా ఐదుగురి అరెస్ట్
ఘటనను వీడియో తీసి ప్రచారం చేసినందుకు అదుపులో మరో ముగ్గురు
నిందితులను కఠినంగా శిక్షించాలని ఢాకాలో విద్యార్థుల భారీ ఆందోళనలు
బంగ్లాదేశ్‌లో 21 ఏళ్ల హిందూ మహిళపై స్థానిక రాజకీయ నేత అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ దారుణానికి నిరసనగా రాజధాని ఢాకాలో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత ఫజోర్ అలీతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమిల్లా జిల్లాలోని రామ్‌చంద్రపూర్ పచ్కిట్ట గ్రామానికి చెందిన ఫజోర్ అలీ (38) ఈ నెల 26న రాత్రి 10 గంటల సమయంలో ఓ మహిళ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. బాధితురాలి భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండటంతో, ఆమె తన పిల్లలతో కలిసి 'హరి సేవ' పండుగ కోసం పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె తలుపు తీయడానికి నిరాకరించడంతో నిందితుడు బలవంతంగా లోపలికి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
ఘటన అనంతరం స్థానికులు ఫజోర్ అలీని పట్టుకుని దేహశుద్ధి చేయగా, వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలు తర్వాతి రోజున రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో మురాద్‌నగర్ పోలీసులు మహిళలు, చిన్నారుల వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఫజోర్ అలీని నిన్న ఉదయం 5 గంటలకు ఢాకాలోని సయదాబాద్ ప్రాంతంలో ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి.
ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీడియో చిత్రీకరించి, వ్యాప్తి చేసినందుకు మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘డైరెక్ట్ యాక్షన్’ తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi