Hot Posts

6/recent/ticker-posts

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తెరపైకి కవిత పీఏ పేరు


ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్‌లో కీలక ఆడియో

ఎమ్మెల్సీ కవిత పీఏకు సిట్ నోటీసులు

దర్యాప్తును వేగవంతం చేసిన సిట్

మరికొందరు బీఆర్ఎస్ నేతలకూ సమన్లు పంపినట్లు సమాచారం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్‌లో కవిత పీఏకు సంబంధించిన కొన్ని ఆడియో రికార్డింగులను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు రాబట్టేందుకు సిట్ ఆయనను విచారణకు పిలిచింది.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ అధికారులు, ఇప్పటివరకు మొత్తం 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేల్చారు. వీరిలో ఇప్పటికే 228 మంది బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. పలువురు వీఐపీల నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ప్రణీత్ రావును విచారించినప్పుడు లభించిన ఆధారాల మేరకు దర్యాప్తు పరిధిని మరింత విస్తరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పీఏతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలకు సైతం సిట్ అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ పరిణామంతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిట్ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi